
అయ్యో.. గోమాత!
బషీరాబాద్: గోశాలలో గోవులను కట్టేసిన తగుళ్లే(తాడు) యమపాశాలయ్యాయి. వరద ఉధృతి నుంచి తప్పించుకోలేక 91 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ఈ హృదయ విదారక ఘటన జీవన్గీ–జెట్టూరు శివారులో కాగ్నా నది ఒడ్డునున్న గోశాలలో చోటు చేసుకుంది. వరద ఉధృతి తగ్గడంతో ఆదివారం గోశాల నిర్వాహకులు అక్కడి పరిస్థితి చూసి భీతిల్లారు. మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఈ గోశాల బాధ్యతను గంగ్వార్‌కు చెందిన బంధువు ప్రతాప్‌రెడ్డి చూసుకుంటున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురవడంతో శనివారం కాగ్నా నది వరద పోటెత్తి గోశాలపై నుంచి సుమారు ఏడు ఫీట్లకు పైగా ప్రవహించింది. వరదల్లో చిక్కుకున్న 136 పశువుల్లో 45 గోవులను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడగా 46 కళేబరాలు లభ్యమయ్యాయి. మరో 45 జీవాలు వరదకు కొట్టుకుపోయాయని నిర్వాహకులు తెలిపారు. గోవుల కళేబరాలను ఖననం చేశారు.
కాగ్నా వరదకు 91 మూగజీవాలు మృత్యువాత