
కాంగ్రెస్‌ది కపట నాటకం
● బీసీ రిజర్వేషన్ అడ్డుకునేందుకు సీఎం అనుచరుడితో కోర్టులో పిటిషన్
● రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్
తాండూరు: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాన్ని 42 శాతం రిజర్వేషన్‌ల పేరిట దగా చేస్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ ట్రస్ట్ భవనంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించి 42 శాతం బీసీలకు రిజర్వేషన్‌లు అమలు చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ నెల 26వ తేదీన 42 శాతం రిజర్వేషన్‌పై ప్రభుత్వం జీఓ జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్‌లు ప్రకటించారన్నారు. రిజర్వేషన్‌లు ప్రకటించిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు మాధవరెడ్డి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారన్నారు. రిజర్వేషన్‌లను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కపట నాటకమాడుతోందని ఆరోపించారు. బీసీ బిల్లు గవర్నర్ వద్ద నేటికీ పెండింగ్‌లో ఉందన్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందకుండానే ప్రభుత్వం రిజర్వేషన్‌ల జీఓలను తీసుకొచ్చి మోసం చేస్తోందన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నా చేస్తే ఏఐసీసీ నేతలు ఎందుకు మద్దతు తెలపలేదని ప్రశ్నించారు. బీసీలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు తెలిసేలా 22 నెలల పాలనలో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట బీఆర్‌ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ప్రజా ఉద్యమం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు భానుప్రసాద్, నరేష్‌గౌడ్, సిద్దిక్, శ్రీధర్, మనోహర్ తదితరులున్నారు.