
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ
అనంతగిరి: వీరనారి, గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ సుధీర్‌తో కలిసి ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌డీఓ మంగీలాల్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మాధవరెడ్డి, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి, డీపీఆర్‌ఓ చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.