
ప్రశ్నిస్తే అరెస్టులా?
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపాటు కొడంగల్‌లో బాధితులను కలిసేందుకు వెళ్తుండగా నిర్బంధం పలు ఠాణాలు తిప్పి చన్గోముల్ పీఎస్‌కు తరలింపు భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ నేతలు పలుచోట్ల నాయకుల ముందస్తు అరెస్టులు
దుద్యాల్/దోమ/పూడూరు/పరిగి: పేదలు, బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే అక్రమంగా అరెస్టులు చేస్తారా..? అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం దోమ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అక్రమ అరెస్టులతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. కొడంగల్ పట్టణంలో అభివృద్ధి పేరిట అడ్డగోలుగా పేదల ఇళ్లు, మసీదులు, దర్గాలు, చర్చిలు కూల్చివేయడం సరికాదని హితవు పలికారు. అరాచకాలను ప్రశ్నించేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. తాము ఏనాడూ అభివృద్ధిని అడ్డుకోలేదని, బాధితులకు పూర్తి న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలని కోరుతున్నట్లు వివరించారు. పేదల ఇళ్లు కూల్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
అసలేం జరిగిందంటే..
కోస్గి పట్టణంలో ఓ వివాహ వేడుకకు హాజరైన నరేందర్‌రెడ్డి కొడంగల్‌కు బయలుదేరారు. ఇటీవల కొడంగల్‌లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు పలు ఇళ్లు, దర్గా, శ్మశానవాటికను కూల్చివేశారు. ఈవిషయమై నాలుగు రోజుల క్రితం బాధితులు, ముస్లింలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో వారిని కలిసేందుకు నరేందర్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దుద్యాల్ గేటు వద్ద ఆయన్ను అరెస్టు చేశారు. మొదట దుద్యాల్ పీఎస్‌కు తరలించాలని భావించారు. అయితే అక్కడికి బీఆర్‌ఎస్ నేతలు చేరుకోవడంతో దోమ స్టేషన్‌కు ఆ తర్వాత చన్గోముల్ పోలీస్‌స్టేషన్ తరలించారు. నరేందర్‌రెడ్డి తోపాటు దౌల్తాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల మైపాల్, హస్నాబాద్ మైనార్టీ నాయకుడు ఉస్మాన్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
ముందస్తు అరెస్టులు
పట్నం నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పలువురు బీఆర్‌ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రామకృష్ణను కొడంగల్‌లో అరెస్టు చేసి పరిగి స్టేషన్‌కు తరలించారు. వీరిని జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మీర్ మహమూద్ అలీ, మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సురేందర్ తదితరులు కలిశారు. అలాగే దుద్యాల్ మండల అధ్యక్షుడు చాంద్ పాషా, నాయకులు నరేశ్ గౌడ్, బుగ్గప్ప, బసిరెడ్డి, సోమనాథ్, రాములు, విశాల్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు
నరేందర్‌రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, మాజీ ఎంపీపీ మల్లేశం, పార్టీ శ్రేణులు దోమ పీఎస్‌కు చేరుకుని నరేందర్‌రెడ్డిని పరామర్శించారు. పాలన చేతగాకే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.