
యంత్రం జాడేదీ !
రాయితీ వ్యవసాయ పరికరాల కోసం రైతుల ఎదురుచూపులు
వికారాబాద్: రాయితీ యంత్ర పరికరాల కోసం మహిళా రైతులు ఎదురుచూడక తప్పడం లేదు. దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం వాటి ఊసెత్తడంలేదు. మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీపై పథకం అమలు చేయాలని నిర్ణయించింది. కిసాన్, స్వయం సహాయక సంఘాల ద్వారా పరికరాల కొనుగోలుకు అవకాశం కల్పించింది. అయితే ప్రక్రియ దరఖాస్తుల దశ దాటడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం యంత్రలక్ష్మి పథకం పేరిట వ్యవసాయ పనిముట్లు అందిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ హయాంలో రైతు బంధు, రైతు బీమా పథకాల కారణంగా రాయితీ యంత్రాలకు స్వస్తి పలికారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పథకం అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఇంకా ప్రారంభం కాలేదు. ఈలోగా కేంద్ర ప్రభుత్వం మహిళా రైతులకు సబ్సిడీపై పని ముట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా దరఖాస్తులు కూడా స్వీకరించింది.
జిల్లాకు 454 యూనిట్లు
జిల్లాకు 454 యూనిట్లు మంజూరు చేశారు. జనరల్ కేటగిరి కింద చిన్న, సన్నకారు రైతులతోపాటు పెద్ద రైతులు వస్తారు. వీరికి 338 యూనిట్లు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా రైతుల కోసం 77 యూనిట్లు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు 39 యూనిట్లు కేటాయించారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, జనరల్‌కు 116 యూనిట్లు కేటాయించారు. పరిగి నియోజకవర్గంలోని ఎస్సీలకు 17, ఎస్టీలకు 09, జనరల్‌కు 77 యూనిట్లు కేటాయించారు. కొడంగల్ నియోజకవర్గంలోని ఎస్సీలకు 20, ఎస్టీలకు 11, జనరల్‌కు 79 యూనిట్లు మంజూరు చేశారు. తాండూరు నియోజకవర్గంలోని ఎస్సీలకు 15 యూనిట్లు, ఎస్టీలకు 8, జనరల్ మహిళలకు 64 యూనిట్లు కేటాయించారు. ఇందులో కాళ్లు, చేతుల సాయంతో పని చేసే స్ప్రేయర్లు, బ్యాటరీతో పని చేసే స్ప్రేయర్లు ఉన్నాయి. నాగలి, గొర్రు, ఎరువులు, విత్తనాలు వేసే ట్రాక్టర్‌కు వినియోగించే పరికరాలు, పురుగుల మందు స్ప్రే చేసేం డ్రోన్లు కూడా ఉన్నాయి. పవర్ వీడర్లు, బ్రష్ కటర్లు తదితర యంత్ర పరికరాలను రాయితీపై అందజేయనున్నారు. ఈ విషయమై డీఏఓ రాజరత్నంను వివరణ కోరగా యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్న విషయం నిజమే కానీ, అర్హుల ఎంపికపై తమకెలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు.
ఆరు నెలల క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
జిల్లాకు 454 యూనిట్లు మంజూరు
మహిళా రైతులకు మాత్రమే..
రూ.3 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఉపయోగం
అర్హులు ఎవరంటే..
2024 – 25 వ్యవసాయ సంవత్సరానికి గాను ఈ పథకం వర్తింపజేయనున్నారు. రూ.3 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీ వర్తించనుంది. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులకు రిజర్వేషన్ ప్రాతిపదికన వాటా కేటాయించగా మిగతా సామాజిక వర్గాలకు జనరల్ కేటగిరి కింద కేటాయించారు. మహిళా రైతులందరూ ఈ పథకానికి అర్హులు. ఎకరంలోపు వ్యవసాయ భూమి ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.లక్షకు పైగా విలువ చేసే యంత్రాలు కావాల్సి వస్తే ఒక ఎకరం కంటే ఎక్కువ భూమి ఉండాలి. ఎకరంలోపు ఉంటే రూ.లక్షలోపు యంత్రాల కోసం అర్జీ పెట్టుకోవచ్చు. వ్యవసాయ డ్రోన్లు, మినీ ట్రాక్టర్లు కావాలంటే కనీసం రెండున్నర ఎకరాల పొలం ఉండాలి. జిల్లాస్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.