
యూరియా మహాప్రభో..!
తాండూరు రూరల్/బషీరాబాద్: యూరియా బాధలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని ఈ సమస్య వెంటాడుతోంది. తెల్లవారింది మొదలు సొసైటీ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. రోజంతా పడిగాపులు కాసినా బస్తా కూడా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు వదిలేసి యూరియా కోసం తిరగాల్సి వస్తోందని పలువురు పేర్కొన్నారు. మా బాధలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పంటలకు పైపాటుగా యూరియా వాడాల్సి ఉందని తెలిపారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎల్మకన్నె సొసైటీ కార్యాలయానికి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. చెప్పులను క్యూలో ఉంచి యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. బషీరాబాద్ మండలం నావంద్గీ సొసైటీ కార్యాలయం వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా కొరతపై రైతులు తరచూ రోడ్డెక్కుతున్నారు. సాగుకు సరిపడా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వారం రోజులుగా పడిగాపులు
వారం రోజులుగా యూరియా కోసం నావంద్గీ సొసైటీ కార్యాలయానికి వస్తున్నా. కనీసం టోకెన్ కూడా దొరకడం లేదు. 4.18 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. ఇప్పటి వరకు యూరియా వాడలేదు. పంట దెబ్బతింటోంది. నాలుగు సంచుల యూరియా ఇస్తే పంటను కాపాడుకుంటా.
– జగదీష్, రైతు, గంగ్వార్
ఇండెంట్ ప్రకారమే..
మండల వ్యవసాయ అధికారులు పంపిన ఇండెంటు ప్రకారం సొసైటీకి యూరియా వస్తోంది. ఇప్పటి వరకు 8వేల బస్తాలు పంపిణీ చేశాం. ఇంకా 80 మొట్రిక్ టన్నులు అవసరం ఉంది. రైతుల బాధలు చూడలేకపోతున్నాం. సాగుకు సరిపడా యూరియా వస్తే ఇబ్బందులు ఉండవు.
– వెంకట్‌రామ్‌రెడ్డి, చైర్మన్, నావంద్గీ సొసైటీ
ఆందోళన వద్దు
తాండూరు మండలంలో యూరియా కొరత లేదు. బుధవారం ఎల్మకన్నె సొసైటీకి 450 బస్తాల యూరియా వచ్చింది. రైతులందరికీ సరఫరా చేస్తున్నాం. గురువారం చెంగోల్ గ్రామంలో యూరియా అందుబాటులో ఉంటుంది. రైతులు ఆందోళన చెందరాదు. పట్టాదారు పాసు పుస్తకం తెచ్చి యూరియా తీసుకెళ్లాలి.
– కొమురయ్య, ఏడీఏ, తాండూరు
పక్షం రోజులుగా ఎరువుల కొరత
కార్యాలయాల వద్ద నిత్యం పడిగాపులే
సాగుకు సరిపడా సరఫరా చేయని వైనం
బస్తాతో సరిపెడుతున్న అధికారులు
ఆందోళనలో అన్నదాతలు

యూరియా మహాప్రభో..!