
వేగం పెంచండి
అభివృద్ధి పనుల్లో
మంచాల: తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల(టీపీఎస్) అభివృద్ధి పనులను వేగిరం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు. బుధవారం వారు మంచాల మండల పరిధిలోని ఆరుట్ల, మంచాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక, జరుగుతున్న పనులు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరుట్లలో ప్రీ ప్రైమరీ పాఠశాల నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు సులువుగా ఉంటుందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని.. విద్యార్థుల సంఖ్య సైతం అదే విధంగా పెరిగిందన్నారు. డిజిటల్ తరగతులు, క్రీడా ప్రాంగణం, పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. పనులు మరింత వేగిరం చేయాలని సూచించారు. పాఠశాలల అభివృద్ధితోనే పిల్లల భవిష్యత్ మారుతుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అదనపు తరగతి గదులు, లైబ్రరీ, సరిపడా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కమిటీ కోరింది. అనంతరం మంచాల ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడ చెప్పట్టే అభివృద్ధి కార్యక్రమాలను మ్యాప్ ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సుశీందర్‌రావు, విద్యా కమిషన్ సభ్యులు పద్మజాషా, జ్యోత్స్న, ఎంఈఓ రాందాస్, మంచాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య, ప్రధానోపాధ్యాయులు గిరిధర్‌గౌడ్, నారాయణరెడ్డి, ఝాన్సీ, రుబియానా బేగం, మోహన్‌రెడ్డి, ఆయా పాఠశాలలకు చెందిన పేరెంట్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
నవంబర్ 14న సీఎం రాక?
ఈ నెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వసతులు, విద్యాశాఖ అధికారులతో సమావేశమై విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే భాగంగానే పనులు వేగవంతగా చేపట్టాలని ఉన్నత స్థాయి అధికారులు సందర్శనార్థం వచ్చినట్లు సమాచారం. నవంబర్ 14న సీఎం వచ్చే అవకాశం ఉందని వినికిడి.
రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి
ఆరుట్ల, మంచాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినఅధికారుల బృందం