
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
కుల్కచర్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటి అధిక స్థానాలు సొంతం చేసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. బుధవారం కుల్క చర్లలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత మోర్చా మండల అధ్యక్షుడిగా ఆంజనేయులును, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా మహేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీజేపీ శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జి.వెంకటయ్య ముదిరాజ్, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడు వెంకటయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హరికృష్ణ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్యారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కాటనిపల్లి ఆంజనేయులు, మైపాల్, నాయకులు రాంచంద్రయ్య, కొండ ఆంజనేయులు, సూర్యకాంతం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
అధిక స్థానాలు సొంతం చేసుకుంటాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి