
బాబోయ్.. భౌభౌ
గ్రామ సింహాల హల్‌చల్
విశ్వాసానికి మారుపేరైన శునకాలు.. విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నాయి. దీంతో ప్రజలే కాదు.. జంతు ప్రేమికులు సైతంఆందోళన చెందుతున్నారు. ఇటీవల కుక్కకాటు కేసులు పెరుగుతుండటంతో వాటికి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాండూరు రూరల్: వీధి కుక్కలతో ప్రజలు బెంబేతెత్తిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎటునుంచి వచ్చి పిక్కలు పట్టేస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో వీధి కుక్కల బెడద అంతకంతకూ పెరిగిపోతుండగా.. అదే స్థాయిలో కేసులు పెరుగుతుండటం ఆదోళన కలిగిస్తోంది.
వెంబడించి..
మండల పరిధి 33 గ్రామాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మేజర్ గ్రామపంచాయతీ మల్కాపూర్, సమీపంలోని కోటబాసుపల్లి, వడ్డెరబస్తిని కలుపుకొని ఇక్కడ సుమారు ఐదు వేలకు పైగా జనాభా ఉంది. ఈ గ్రామంలోని ఏ వీధిలో చూసినా కుక్కల గుంపు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అకారణంగా దాడులకు పాల్పడుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల క్రితం నడుచుకుంటు వెళ్తున్న బాలుడు ఆనంద్‌ను కరిచాయి. అంతే కాకుండా గడిచిన కొద్దిరోజుల్లో మన్‌సన్‌పల్లి బాలరాజ్, కుర్వ మణిక్యప్ప, హన్మంత్, ప్రణయ్, భాగ్యలను కాటు వేశాయి. దీంతో సుమారు 20 మంది వరకు బాధితులు ఉంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కుక్కకాటు బాధితులు రేబిస్ వ్యాధితో చనిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో బాధితులు, గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు. ఒంటరిగా ఏ ఒక్కరు నడిచుకుంటు వెళ్లినా వెంబడిస్తున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి, గ్రామసింహాల బారి నుంచి కాపాడాలని, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దారిన పోయే వారిపై..
వీధుల్లో కుక్కల గుంపుని చూసి భయపడుతున్నాం. మా కాలనీలో చిన్నారులపై తరచూ దాడులు చేస్తున్నాయి. రోజురోజుకూ వాటి ఆగడాలు పెరిగిపోతున్నాయి. దారిన పోయే వారిపై అకారణంగా ఎగబడుతున్నాయి. అధికారులు స్పందించి, వాటి నుంచి రక్షణ కల్పించాలి.
– రాములమ్మ, మల్కాపూర్ గ్రామం నియంత్రణకు కృషి
గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే విషయాన్ని పశువైద్యాధికారులతో పాటు పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. వాటి నియంత్రణకు కృషి చేస్తా. ఎవరూ ఆందోళన చెందవద్దు.
– ఇస్మాయిల్, జీపీ కార్యదర్శి,
మల్కాపూర్
గాయాన్ని చూపుతున్న బాలుడు
బెంబేలెత్తుతున్న ప్రజలు
మల్కాపూర్‌లో స్వైరవిహారం
20కి పెరిగిన కుక్కకాటు
బాధితుల సంఖ్య