
కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి
● పరిగికి నలువైపులా రహదారుల విస్తరణ
● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి అడ్డంకులు తొలగడంతో.. బుధవారం రోడ్డు విస్తరణ సాధన సమితి సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నందున రూపులేఖలు మారుతున్నాయని చెప్పారు. గతంలో ఎన్‌హెచ్ 163 అభివృద్ధిని గత ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. ప్రస్తుతం అడ్డంకులు తొలిగి, పనులు ప్రారంభం అయ్యాయని, అవి పూర్తయితే జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పరిగి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పరిగి నుంచి కొడంగల్‌కు నాలుగు లైన్లు, జిల్లా కేంద్రానికి నాలుగు లైన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని వివరించారు.
గుడిసె లేని ఊరే లక్ష్యం
గుడిసెలు లేని ఊరు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని సుల్తాన్‌పూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ.. పదేళ్లు అధికారంలో ఉండి, ఏ ఒక్క పేదవాడికి ఇళ్లు కట్టించి ఇవ్వలేదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే పేదవారి సొంతింటి కల నెరవేర్చిందన్నారు.