
అంత్యక్రియలకు వెళ్లి.. శవమై తేలి
స్నానానికి చెరువులో దిగి వ్యక్తి గల్లంతు
బషీరాబాద్: అంత్యక్రియలకు వెళ్లిన ఓ వ్యక్తి అనంత లోకాలకు వెళ్లాడు. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మంతట్టి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నుమాన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగంపల్లి శ్యాణప్ప(52) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. మంగళవారం అదే గ్రామానికి చెందిన అభిషేర్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన.. ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యలో స్నానం చేయడానికి పిన్‌చెరువులోకి దిగి నీట మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. చికటి పడడంతో గాలింపు సాధ్యపడలేదు. బుధవారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, మృతదేహాన్ని బయటకు తీశారు. మద్యం మత్తులో ఉండటంతోనే శ్యాణప్ప నీటి మునిగి మృతి చెందాడని మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి కొడుకు శ్యామప్ప, కూతురు సవిత ఉన్నారు.