
వేతనాలు చెల్లించాలి
తాండూరు టౌన్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న పార్ట్‌టైం ఉపాధ్యాయులకు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వెంటనే వేతనాలు చెల్లించాలని పలువురు మంగళవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఇంటి కిరాయి చెల్లించలేక, నిత్యావసర సరుకులు కొనలేక నానాయాతన పడుతున్నామన్నారు. పండగ పూట ఇంటిళ్లిపాది పస్తులు ఉండాల్సిన స్థితి ఏర్పడిందని వాపోయారు. గురుకుల కార్యదర్శులు ఒకరి తర్వాత ఒకరు బదిలీపై మారుతూ వస్తున్నా, ఎవరూ తమ వేతనాల గూరించి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పార్ట్‌టైం ఉపాధ్యాయులకు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెలా 5వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని కోరారు.
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో నెల రోజుల పాటు పూజా సామగ్రి విక్రయానికి వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక మాసంలో టెంకాయలు, పూజా సామగ్రి విక్రయించడంతోపాటు కొబ్బరి చిప్పల సేకరణకు ఈ నెల 27న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ ప్రాంగణంలో వేలం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్
బంట్వారం: భూస్వాముల చెరలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని బొప్పునారం సర్వే నంబర్ 69లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని 187 ఎకరాల అసైన్డ్ భూమిని గతంలో ప్రభుత్వం దళితులకు పంచిందన్నారు. అప్పటి నుంచి వారే సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెత్తందారులు ఆ భూములను అక్రమంగా పట్టాలు చేసుకొని అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నరని తెలిపారు. పేదలకు న్యాయం చేయాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
తాండూరు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 157 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి పథకం చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పపత్రిలో వైద్యం పొందిన వారు సీఎంఆర్‌ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు పట్లోళ్ల బాల్‌రెడ్డి, మాధవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
ధారూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సాజిదాబేగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కుమ్మరిపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 30 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. దీని విలువ రూ.21,600 ఉంటుందని తెలిపారు. ఉదయం 11 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని తహసీల్దార్ కోరారు.

వేతనాలు చెల్లించాలి