
పత్తి సేకరణకు ఏర్పాట్లు చేయండి
● మిల్లుల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
● అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: పత్తి కొనుగోలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. అలాగే కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు, సంబంధిత ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,46,725 ఎకరాల్లో పత్తి సాగు చేశారని, 2,68,282 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలుకు రైతుల ఆధార్ కార్డు ప్రామాణికమని, బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు కాని రైతుల జాబితాను ఏఈఓలు పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని తెలిపారు. నకిలీ పత్రాలు జారీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ఏ గ్రేడ్ పత్తికి రూ. 8,110 మద్దతు ధర ప్రకటించిందన్నారు. బీ గ్రేడ్‌కు రూ.7,710 ధర నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రతి మిల్లులో కాంటాలను పరిశీలించాలని తూనికలు కొలతల శాఖ అధికారులకు ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫైర్ శాఖకు సూచించారు. జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి వాహనాలకు ఇబ్బందులు ఎదురుకాకుందా పోలీస్, రవాణా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రామునాయక్, సీసీఐ అసిస్టెంట్ మేనేజర్ ప్రజక్త, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి సారంగపాని, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, విద్యుత్, రవాణా, పోలీస్ అధికారులు, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.