
ప్రసవానికి వచ్చి.. ప్రాణం కోల్పోయి..
● మాతా శిశు ఆస్పత్రిలో గర్భిణి మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
తాండూరు టౌన్: కాన్పు కోసం వచ్చిన గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రావులపల్లికి చెందిన అఖిల(23)ను రెండో కాన్పు కోసం వారి కుటుంబీకులు ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సోమవారం ఉదయం 6 గంటలకు డాక్టర్ మంజుల వారికి సూచించారు. ఆ తరువాత కొద్దిసేపటికే కడుపులో బిడ్డతో పాటు అఖిల మృతి చెందింది. దీంతో బంధువులు ఎంసీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. రాత్రంతా బాగానే ఉందని చెప్పిన వైద్య సిబ్బంది, తెల్లవారగానే పరిస్థితి విషమంగా ఉందని, మరో దవాఖానకు తీసుకెళ్లాలని చెప్పడం, కొద్దిసేపటికే గర్భిణి చనిపోవడానికి కారణం వైద్య సిబ్బందే కారణమని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహిరించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ కౌన్సిలర్ సోమశేఖర్ మాట్లాడుతూ.. ఎంసీహెచ్‌లో ఇలాంటి సంఘట నలు తరచూ జరుగుతున్నాయని, అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ.. గర్భిణి మృతిపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గైనకాలజిస్ట్‌పై వేటు
కాన్పు కోసం మాతాశిశు ఆస్పత్రికి వచ్చిన గర్భిణి మృతిపై రాష్ట్ర వైద్య విచారణ బృందం సభ్యులు సోమవారం రాత్రి వరకు విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గైనకాలజిస్ట్ డాక్టర్ మంజులను విధుల నుంచి తొలగించారు. ఇందుకుసంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి రావులపల్లికి చెందిన అఖిల.. కాన్పు నిమిత్తం తాండూరులోని మాతాశిశు ఆస్పత్రికి వచ్చి సోమవారం ఉదయం మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ట్ర విచారణ బృంద సభ్యులు నేషనల్ హెల్త్ మిషన్ గైనకాజిస్ట్ డాక్టర్ సుమిత్ర, మెడికల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి, అనస్తీషియన్ డాక్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. గర్భిణి ఎంసీహెచ్‌కు వచ్చిన సమయం నుంచి ఆమె మృతి వరకు జరిగిన విషయాలపై సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కడుపులో శిశువు మృతి చెందడం, అధిక రక్తస్రావం వల్ల ఆమె మృతి చెంది ఉంటుందని విచారణ బృంద సభ్యులు తెలిపారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎంసీహెచ్‌కు గర్భిణి రాగా డ్యూటీ డాక్టర్ మంజుల తెల్లవారుజామున 5గంటలకు ఆస్పత్రికి వచ్చి ఆమెను పరీక్షించడాన్ని బృంద సభ్యులు తప్పుబట్టారు. విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెను విధుల నుంచి తొలగిస్తునట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి తెలిపారు.

ప్రసవానికి వచ్చి.. ప్రాణం కోల్పోయి..

ప్రసవానికి వచ్చి.. ప్రాణం కోల్పోయి..