
జనావాసాలు.. జలమయం
తుర్కయంజాల్: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం సాయంత్రం మొదలు రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. 7.5 సె.మి. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధి పలు ప్రాంతాల్లో 10 సె.మి. వర్షం కురిసింది. దీంతో తుర్కయంజాల్ మాసబ్ చెరువుకు వరద పోటెత్తింది. అక్కడి నుంచి నుంచి ఇంజాపూర్ దిలావర్‌ఖాన్ చెరువుకు నీరు ప్రవహించే వాగు జలప్రవాహానికి ఆపిల్ అవెన్యూ, ఇందిరమ్మ కాలనీలు నీటిలో తేలియాడాయి. సోమవారం సాయంత్రం భారీ వర్షం పడగా.. రెండు ఫీట్లకు పైగా నీరు అపార్ట్‌మెంట్లలో చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో గడిపారు.
వద్దన్నా వినకుండా..
ఇంజాపూర్ నుంచి తొర్రూర్‌కు వెళ్లే మార్గంలో సుమారు 200 ఫీట్ల వెడల్పుతో నీరు ప్రవహిస్తుండటంతో.. అప్రమత్తమైన మున్సిపల్ కమిషనర్ కె.అమరేందర్ రెడ్డి అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. అడ్డుగా రాళ్లను పెట్టించారు. ఇది లెక్కచేయని బైరమాల్‌గూడకు చెందిన ముగ్గురు యువకులు.. వరదలో కారును ముందుకు పోనిచ్చారు. ప్రవాహం పెరగడంతో కారు ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెకు తగిలించి నిలిపారు. అతి కష్టం మీద, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ముగ్గురు యువకులను బయటకు రప్పించారు.