
‘స్థానిక’.. కదలిక!
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం
జిల్లాలో స్థానిక స్వరూపం
వికారాబాద్: దసరాకు ముందే స్థానిక సందడి మొదలు కానుంది. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు అందడం, ఆ మేరకు వార్డు, గ్రామ, మండల స్థాయి ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను రెడీ చేసి ఉంచడం తెలిసిందే. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పనకు సంబంధించిన జీఓ వెలువడిన వెంటనే డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఒకటిరెండు రోజుల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఉండటం, నెలాఖరులోగా ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉండటంతో ఇప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న ఆశావహుల్లో మళ్లీ చర్చ మొదలైంది. తొలి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత వార్డు మెంబర్లు, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఓటర్ల ముసాయిదా వెల్లడి
జిల్లాలో 20 మండలాలు ఉండగా, వీటి పరిధిలో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. 20 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 227 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలో ఓటర్ల జాబితాలను పంచాయతీ/ మండల పరిషత్ కార్యాలయాల్లో వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. వీకెండ్‌లో కానీ/దసరా సెలవుల్లో కానీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
నేడో, రేపో రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తుందనే అంచనాలు
ఈ నెలాఖరులో ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం
ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న నేతల్లో ఒక్కసారిగా కదలిక
గ్రామ, మండలాల వారీగా సమావేశాల నిర్వహణకు పార్టీల యోచన
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశాం. ఓటర్ల జాబితా తయారీలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారమివ్వబోం. బోగస్ ఓట్లకు తావు లేకుండా పక్కాగా రూపొందిస్తున్నాం. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించి, అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తాం. నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్ల స్వీకరణ తర్వాతే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తులను ముద్రించనున్నాం. ఇందుకోసం అవసరమైన బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచాం. బ్యాలెట్ బాక్సులను ఇతర రాష్ట్రాల నుంచి సమకూర్చనున్నాం.
– ప్రతీక్‌జైన్, కలెక్టర్
గ్రామ పంచాయతీలు 594
వార్డులు 5,058
మొత్తం ఓటర్లు 6,99,895
పురుషులు 3,44,963
మహిళలు 3,54,912
ఇతర ఓటర్లు 19
ఎంపీటీసీలు 227
జెడ్పీటీసీలు 20