
పట్టపగలే దారుణం
● మేనత్తపై కత్తితో దాడిచేసిన అల్లుడు
● పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు
తాండూరు టౌన్: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. అయిన వారే ఒకరిని ఒకరు చంపుకునే ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. పంది మాంసం విక్రయం విషయంలో తలెత్తిన గొడవ చివరకు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన తాండూరు పట్టణంలోని మల్లప్ప మడిగె వద్ద చోటు చేసుకుంది. పట్టణ సీఐ సంతోశ్ కుమార్ తెలిపిన ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన పిచ్చకుంట్ల పద్మమ్మ(60) స్థానిక మల్లప్ప మడిగ వద్ద పంది మాంసం విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె మేనల్లుడు వెంకటి తాను సైతం ఇక్కడే మరో దుకాణం పెడతానని అత్తకు చెప్పాడు. దీంతో ఆమె నా వ్యాపారం దెబ్బతీయొద్దని అల్లుడును కోరింది. ఇదే విషయంలో ఇరువురి మధ్య పలుమార్లు గొడవలు తలెత్తాయి. అత్త తన వ్యాపారానికి అడ్డుగా ఉందని భావించిన వెంకటి.. ఆదివారం మధ్యాహ్నం మాంసం విక్రయిస్తున్న పద్మమ్మ వద్దకు వచ్చి ఒక్కసారిగా ఆమె తలపై కత్తితో దాడి చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దాడిని చూసి బెంబేలెత్తిన జనం అనంతరం తేరుకుని రక్తమడుగులో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం నిందితుడు వెంకటి పట్టణ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలికి భర్త, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి మెడలో రెండు తులాల బంగారు గొలుసు ఉండాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బంగారం ఎవరు తీసుకుని ఉంటారనేది విచారిస్తున్నామన్నారు.