
నమో యువ రన్
తాండూరు: పట్టణంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం నమో యువరన్ కార్యక్రమం నిర్వహించారు. రన్ అనంతరం స్థానిక విలియం మూన్ పాఠశాల మైదానంలో వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేష్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపారన్నారు. దేశానికి ఆరోగ్యకరమైన యువతే వెన్నుముక అన్నారు.
మట్టిగుంతలో పడి పంచాయతీ కార్మికుడి మృతి
తాండూరు రూరల్: మట్టిపనికి వెళ్లిన పంచాయతీ కార్మికుడు గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఎల్మకన్నె గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రమెట్టి బాలప్ప(38) పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బోనమ్మ ఆలయం వద్ద మట్టి తవ్వేందుకు తీసుకెళ్లాడు. మట్టి ట్రాక్టర్‌లో నింపుతుండగా బాలప్ప ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. వెంటనే ఆయన్ను తాండూరు పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం.
చికిత్స పొందుతున్న అడ్వకేట్ మృతి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న అడ్వకేట్ బాలయ్య(58) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. బంట్వారం మండలం బొపునారం గ్రామానికి చెందిన బాలయ్య వికారాబాద్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు భార్య, నలుగురు కూతుర్లు, కొడుకు ఉన్నారు. మృతుడు గతంలో బార్ అసోసియేషన్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. నవ్వుతూ అందరిని పలకరించే బాలయ్య అకాల మరణం తమను కలిచివేస్తో ందని న్యాయవాదులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని జిల్లా అదనపు న్యాయమూర్తి చంద్రకిషోర్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు సందర్శించి నివాళి అర్పించారు. సాయంత్రం వికారాబాద్‌లో అంత్యక్రియలు ముగిశాయి.
ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణం
నవాబుపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ ప్రైవేటు ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డా డు. ఎస్‌ఐ పుండ్లిక్ తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తు మండల కేంద్రానికి చెందిన అరవింద్(30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆరు నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన వినూత్నతో వివాహమైంది. హైదరాబాద్ నివాసం ఉంటున్న ఈ దంపతుల నడుమ తరచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న డ్యూటీకి వెళ్తున్నాని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. మండల పరిధిలో ని గేట్ వనంపల్లి శివారులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులు సమాచారం ఇచ్చా రు. మృతుడి వద్ద లభించిన ఆధారాలను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు రాజు, లక్ష్మి వచ్చి తమ కొడుకుగా నిర్ధారించారు. అనంతరం మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సమాధుల తొలగింపు సరికాదు
కొడంగల్: అభివృద్ధి పేరిట దర్గాలను తొలగించడం సరికాదని కొడంగల్ పట్టణ ముస్లింలు ఆదివారం ఆందోళన చేపట్టారు. స్థానిక వినాయక్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మహబూబ్ సుబాని దర్గా, వినాయక్ చౌరస్తా సమీపంలోని సమాధులను పోలీసులు రాత్రికిరాత్రే తొలగించారని ఆగ్రహంవ్యక్తం చేశారు. రోడ్ల విస్తరణ పేరిట చిరువ్యాపారుల డబ్బాలు, పేదల ఇళ్లను తొలగించారని వాపోయారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని.. తాము దైవాలు భావించే దర్గాలను పోలీసు బలగాలతో కూల్చడం సరికాదన్నారు. ధర్నా చేస్తున్న ముస్లింలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ధర్నాకు మద్దతుగా బహదూర్‌పూర ఎంఐఎం ఎమ్మెల్యే, బోధన్ మాజీ ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు.

నమో యువ రన్

నమో యువ రన్