
సుడి దోమతో జాగ్రత్త
వరి పైరుకు దోమపోటు
● సమగ్ర యాజమాన్యంతో నివారణ
నవాబుపేట: వరి పంటకు పొట్ట దశలో సుడిదోమ ఆశించే అవకాశం ఉంటుంది. ఇవి వరి మొక్కల నుంచి రసాన్ని పీల్చి మొక్కలను పసుపురంగుకు మార్చి ఎండిపోయేలా చేస్తాయి. ఇది రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి జ్యోతి పేర్కొన్నారు.
గుర్తింపు లక్షణాలు
● వరి పంటలో ప్రధానంగా గోధుమ రంగు దోమ(బీపీహెచ్) , తెల్లవీపు దోమ(డబ్ల్యూపీహెచ్)లు ఆశిస్తాయి.
● పిల్ల, పెద్ద దోమలు గుంపులుగా దుబ్బుల మొదళ్ల నుంచి రసం పీలుస్తాయి.
● ఆకులు లేత పసుపు రంగులోకి మారతాయి.
● పొలంలో నీరు తెట్టులా తేలుతూ కనిపిస్తుంది.
● పంట సుడులుగా వలయాకారంలో ఎండిపోతుంది. దీనిని హావర్ బర్న్ అంటారు.
● తీవ్రత ఎక్కువైతే పొలం ఎండిపోతుంది. తాలు గింజలు ఏర్పాడుతాయి. నూర్పినప్పుడు సూకలు అవుతాయి.
● సుడిదోమ ద్వారా గ్రాసి స్టంట్ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
నివారణ :
ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వాడాల్సిన మందులు
● డైనోటెప్యురాన్ 20ఎస్‌జి–0.4 గ్రాములు/బ్యూప్రొఫెజిన్–1.6 మి.లీ/పైమెట్రొజైన్ 50 డబ్ల్యూజీ–0.60గ్రాములు/ట్రైప్లూమెజోపైరిమ్–0.485 మి.లీ/శ్రీఇమిడాక్లోప్రిడ్ 40శాతం ప్లస్ ఎతిప్రోల్ 40శాతం డబ్ల్యజీ––0.25గ్రాములు లీటరు నీటికి కిలిపి పిచికారీ చేయాలి.
● మందుకు పిచికారీ సమయంలో పొలంలో నీటిని తగ్గించాలి.
● పాయలు తీసి, మందు మొక్కల మొదళ్లపై పడేలా చూడాలి.