
రైల్వే లైన్ మారింది!
కొడంగల్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ రూటు మారింది. నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా రైలు మార్గం నిర్మించడానికి అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో గత వారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైల్వేశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 130 కిలో మీటర్ల దూరం నిర్మించనున్న కొత్త రైల్వే లైన్‌కు సుమారు రూ.2,785 కోట్ల ఖర్చు కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దసర పండుగ తర్వాత సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను రైల్వే బోర్డుకు అధికారులు సమర్పించే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాలో పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, బాలంపేట శివారులో కొత్తగా రైల్వే స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
నిరీక్షణకు మోక్షం
కొడంగల్, పరిగి నియోజకవర్గ ప్రజలు 45 ఏళ్లుగా నిరీక్షిస్తున్న వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్‌కు మోక్షం లభించింది. ఈ మార్గంతో ఇక్కడి ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. రైల్వే లైన్‌తో రవాణా వ్యవస్థ మెరుగు పడడంతో పాటు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేసేందుకు 1980–81లో అప్పటి మహబూబ్‌నగర్ ఎంపీ, రైల్వేశాఖ సహాయ మంత్రి మల్లికార్జున్ సర్వేకు ఆదేశించారు. వికారాబాద్ నుంచి పరిగి, దోమ, సర్జఖాన్‌పేట, మద్దూరు, నారాయణపేట, ఊట్కూ ర్, మక్తల్, మాగనూర్ మీదుగా కృష్ణ వరకు రైల్వే లైన్ నిర్మాణానికి సర్వే చేయించారు. కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మీదుగా రైల్వే లైన్ వేస్తే ఆదాయం వస్తుందని గణాంకాలను విశ్లేషిస్తూ ఇక్కడి ప్రజలు కేంద్రానికి నివేదిక పంపించారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆదేశాల మేరకు రెండో సారి సర్వే చేపట్టారు. కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేస్తే బాగుంటుందని నిపుణులు నివేదిక సమర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్విభజనలో కోస్గి, మద్దూరు మండలాలు నారాయణపేట జిల్లాలోకి వెళ్లాయి. కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ మీదుగా రైల్వే లైన్ వేస్తే వికారాబాద్ జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఉంటుందని స్థానికులు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు.
డీపీఆర్‌కు సీఎం ఆదేశాలు
కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైల్వే అధికారులతో పలుమార్లు సమాలోచనలు చేశారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు కొడంగల్ మండలం టేకుల్‌కోడ్ దగ్గర నిర్మించనున్న సిమెంట్ ఫ్యాక్టరీ మీదుగా రైల్వే నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, మద్దూరు, నారాయణపేట మీదుగా కృష్ణ వరకు రైల్వే లైన్‌కు మార్గం సుగమమైంది.
ముందుగా అనుకున్న రూటు: పరిగి, కొడంగల్, హస్నాబాద్, దౌల్తాబాద్, నారాయణపేట,
కున్సి, కృష్ణ
రూటు మారిన తర్వాత: పరిగి, తుంకిమెట్ల, కొడంగల్, బాలంపేట, మద్దూరు, నారాయణపేట, మక్తల్, కృష్ణ

రైల్వే లైన్ మారింది!