
మండలానికి జీపీవోల కేటాయింపు
దుద్యాల్: గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ అధికారులను నియమించింది. అందుకు గాను మొదటి విడుత ఎంపికలో భాగంగా గతంలో పని చేసిన వీఆర్వోలు, వీర్‌ఏలను ఎంపిక చేసింది. దుద్యాల మండలానికి ఆరుగురిని కేటాయించినట్లు తహసీల్దార్ కిషన్ తెలిపారు. పి గోపాల్, కావలి శ్రీనివాస్, ఆర్ రమేశ్ శుక్రవారం తహసీల్దార్‌కు రిపోర్ట్ చేశారు. మిగత ముగ్గురు కూడా త్వరలో రిపోర్ట్ చేస్తారని తెలిసింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కిషన్ మాట్లాడుతూ..గ్రామాల్లో నెలకొన్న రెవెన్యూ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామన్నారు.
రేడియల్ రోడ్డు వద్దంటూ నిరసన
పరిగి: రైతుల పొలాల నుంచి చేపట్టనున్న రేడియల్ రోడ్డు వద్దని రైతులు, గ్రామస్తులు శుక్రవారం రంగాపూర్‌లో నిరసన చేపట్టారు. దామగుండం నేవీరాడర్ స్టేషన్‌కు వెళ్లేందుకు శంషాబాద్ నుంచి రంగాపూర్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పాత రోడ్డు నుంచే రోడ్డు వేయాలని వారు అధికారులను కోరారు. సర్వే చేసిన విధంగానే వేయనున్నట్లు చెప్పడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నామన్నారు. రేడియల్ రోడ్డు నిర్మాణంతో తమ ఉపాధి హరించకపోతోందని చిన్నకారు, సన్నకారు రైతులు వివరిస్తున్నారు. ఈ విషయం గురించి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి మ్యాప్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న కాలంలో ధర్నాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
జిల్లాస్థాయి క్రికెట్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
శంకర్‌పల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జోనల్ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించినట్లు జోనల్ సెక్రెటరీ ప్రభాకర్ అన్నారు. మండలం పరిధిలోని జన్వాడలో ఏర్పాటు చేసిన ఈ ఎంపికలకు జోన్ (చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాలు) నుంచి 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో అండర్–14లో 18 మంది, అండర్–17 విభాగంలో 18 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. జోనల్ స్థాయిలో ఎంపికై న విద్యార్థులు త్వరలో హైదరాబాద్‌లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
అత్యాచార నిందితుడి అరెస్ట్
ఇబ్రహీంపట్నం: వృద్ధ యాచకురాలిని గాయపరిచి, అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడిని ఇబ్రహీంపట్నం పోలీసులు శుక్రవారం కటకటాల వెనక్కు నెట్టారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం కొత్త బస్టాండ్ వెనుక ఉన్న షాపు వరండాలో బుధవారం అర్థరాత్రి ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధ యాచకురాలిపై లైంగికదాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన పల్లాటి రవీందర్(38)గా గుర్తించి ఆయన్ను చర్లపల్లి జైల్‌కు తరలించామన్నారు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే ఇతనిపై గతంలోనూ పలు కేసులున్నాయన్నారు. ఈ ఘటన విషయం తెలియగానే నాలుగు ప్రత్యేక బృందాలు సీసీ ఫుటేజీలు పరిశీలించి, నిందితుడిని పట్టుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.
ట్రాక్టర్ బోల్తా
ఆమనగల్లు: ట్రాక్టర్ బోల్తాపడడంతో ఒకరు మృతిచెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తలకొండపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన జంగయ్య (50) రెండు నెలలుగా మిడ్జిల్‌లో సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తున్నాడు. శుక్రవారం మరో నలుగురు కూలీల తో కలిసి సిమెంట్ ఇటుకలను ట్రాక్టర్‌లో నింపుకొని తలకొండపల్లి మండలం మాదాయిపల్లికి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. జంగయ్యపై ఇటుకలు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నలుగురికి గాయా లు కాగా చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మండలానికి జీపీవోల కేటాయింపు

మండలానికి జీపీవోల కేటాయింపు