
భయం నీడన బాలిక!
తాండూరు: పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో బాలికలపై వేధింపులు పెచ్చుమీరాయి. వీటిని తట్టుకోలేక అభంశుభం తెలియని విద్యార్థినులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో బాలికలు అదృశ్యమవుతున్నా వీటిని కట్టడం చేయడంలో పోలీస్ శాఖ విఫలమవుతోందనే విమర్శలున్నాయి. 14 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు వయసున్న బాలికల భద్రత తల్లిదండ్రులకు సవాలుగా మారింది. స్కూల్‌కు వెళ్తున్న మైనర్లపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు తెలిసీతెలియని వయసులో ఉన్న బాలికలను కొంతమంది ఆకతాయిలు ప్రేమ పేరుతో వంచిస్తున్నారు. తాండూరు పరిధిలో 2024 జనవరి నుంచి 2025 ఆగస్టు వరకు గడిచిన ఇరవై నెలల కాలంలో 37 మంది బాలికలు అదృశ్యమయ్యారు. మరోవైపు మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై 65 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోలీసుల అధికారిక లెక్కలు ఇలా ఉండగా.. ఫిర్యాదు చేయని ఘటనలు ఇంతకు మించి ఉంటాయనేది బహిరంగ రహస్యం.
తాండూరులోని సెయింట్ మార్క్స్ హైస్కూల్‌లో చదువుతున్న ఓ బాలికతో వైస్ ప్రిన్సిపల్ బాలస్వామి అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. అతని అకృత్యాలను భరించలేని విద్యార్థిని ఈనెల 10న తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో మరుసటి రోజు పాఠశాలకు వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందనే కారణంతో అక్కడితోనే ఆగిపోయారు.
కూతుళ్లను బాగా చదివించాలనే ఉద్దేశంతో ఓ కుటుంబం పట్టణంలోని సాయిపూర్‌లో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటోంది. పదో తరగతి చదువుతున్న బాలిక ఉన్నట్టుండి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణానికి లైంగిక వేధింపులే కారణమని తెలియడంతో శవాన్ని తీసుకెళ్లి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బిడ్డను పోగొట్టుకున్న పుట్టెడు దుఖఃంలో.. పరువును కూడా పోగొట్టుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు.
మైనర్లకు రక్షణ కరువు
ఏటా పెరుగుతున్న అదృశ్యాలు, అఘాయిత్యాలు
పరువు పోతుందని ఫిర్యాదుకువెనకాడుతున్న బాధిత తల్లిదండ్రులు
బాలికలపై నమోదైన కేసులు
పోలీస్ స్టేషన్ 2024లో 2025లో
మిస్సింగ్ పోక్సో మిస్సింగ్ పోక్సో
తాండూరు 02 13 03 15
కరన్‌కోట్ 08 03 03 06
పెద్దేముల్ 03 05 04 10
బషీరాబాద్ 03 01 0 02
యాలాల 04 05 07 05
మొత్తం 20 27 17 38