
నకిలీ అల్లంవెల్లుల్లి పట్టివేత
● పేస్ట్‌తో పాటు రసాయనాలు, రంగుల స్వాధీనం
● ఇద్దరికి రిమాండ్
తాండూరు టౌన్: నకిలీ అల్లంవెల్లుల్లి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం వారిని రిమాండ్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలోని మణికంఠ కిరాణా దుకాణంలో గురువారం టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ పాషా తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. 30 కిలోల నకిలీ అల్లంవెల్లుల్లి పేస్టుతో పాటు, పేస్టు నింపి ఉన్న 111 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుకాణ యజమాని వీరన్నను అదుపులోకి తీసుకుని విచారించారు. తాను హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ సలీం అనే వ్యక్తి వద్ద నకిలీ అల్లంతో పాటు తయారీకి వినియోగించే రసాయనాలు, కృత్రిమ రంగులను కొనుగోలు చేసినట్లు చెప్పాడు. దీంతో ఇమ్రాన్ దుకాణంపై దాడి చేసి 166 కిలోల నకిలీ అల్లంవెల్లుల్లి పేస్టుతో పాటు పేస్టు నింపిన 38 బాటిళ్లు, 30 కిలోల కల్తీఅల్లం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.