
సెమీ స్కిల్డ్ కార్మికులుగా గుర్తించండి
తాండూరు టౌన్: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న స్పాట్ బిల్లింగ్ కార్మికులను టీజీఎస్‌పీడీసీఎల్(దక్షిణ విభాగం) సెమీ స్కిల్డ్ కార్మికులుగా గుర్తించి ఆర్డర్ కాపీని ఇవ్వాలని పలువురు తాండూరు విద్యుత్ డీఈ భానుప్రసాద్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా ఫీస్ రేట్ బేసిస్‌పై టీజీఎస్‌పీడీసీఎల్‌లో పని చేస్తున్న 1,300 మంది స్పాట్ బిల్లింగ్ కార్మికులకు పల్లెల్లో రూ.5 వేలు, పట్టణాల్లో రూ.7వేలు చెల్లిస్తున్నారన్నారు. చాలీ చాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. అయితే గత నెలలో టీజీఎన్‌పీడీసీఎల్(ఉత్తర విభాగం) బిల్లింగ్ కార్మికులనుసెమీ స్కిల్డ్ కార్మికులుగా గుర్తించి ఆర్డర్ కాపీలను అందజేసిందన్నారు. ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు ఒకే విధమైన విధానం లేకపోవడం సమంజసం కాదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బిల్లింగ్ కార్మికులకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలని, లేని ఎడల విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. లక్ష్మీకాంత్‌రెడ్డి, రఫీక్, ప్రతాప్ రెడ్డి, నర్సిములు, సంపత్, హన్మంతు తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.