
‘పాలమూరు’ను పూర్తి చేయండి
● ఎన్నికల హామీలను అమలు చేయాలి
● ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
● మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి సకాలంలో పనులు పూర్తి చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల వద్దకు వెళ్లాలని డిమాండ్ చేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తే కొడంగల్‌తో పాటు నారాయణపేటకు సాగునీరు అందుతుందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులు కేటాయించడం లేదని, తులం బంగారం ఇస్తామని మాట తప్పారని అన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, రైతు బంధు రావడం లేదన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుయాదవ్, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, యాదగిరి, రమేష్‌బాబు, నర్మద కిష్టప్ప, మహిపాల్, భీములు, శేరి నారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సముద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.