
ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని జిల్లా ఈవీఎం గోదాంను గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. ముందుగా ఆయన కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ బొకే అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌తో కలిసి ఈవీఎంలు భద్రపరిచిన గోదాంకు వెళ్లారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్ తీశారు. అనంతరం ఈవీఎంలు, బ్యాలెట్, కంట్రోల యూనిట్లు, ఎన్నికల సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి సంతకాలు చేశారు. అనంతరం ఆయా రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడారు. బీఎల్‌ఓల పేర్లు ఇచ్చారా..? ఓటరు జాబితా పూర్తయ్యిందా అని అడిగారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఆర్‌ఓ మంగీలాల్, ఆర్‌డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నెమత్ అలీ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎంల గోదాంను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి