
మా భూముల్లో ‘రీజినల్’ వద్దు
● అలైన్‌మెంట్ మార్చాలన్న దేవరాంపల్లి రైతులు
● స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు వినతిపత్రం అందజేత
అనంతగిరి: ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చాలని దేవరాంపల్లి రైతులు కోరారు. శుక్రవారం వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రీజినల్ రింగ్‌రోడ్డు ప్రతిపాదిత భూముల జాబితాలో మా గ్రామం ఉందని, పేద రైతులకు చెందిన పొలాలు ఉన్నాయని తెలిపారు. భూములు కో ల్పోతే ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వేరే ప్రాంతం నుంచి ప్రతిపాదించాలని కోరారు. వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నామని, భూములు పోతే ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఏ మాత్రం సరిపోదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు మా గ్రామాన్ని రెండు భాగాలుగా విభజిస్తుందన్నారు. రైతులకు నష్టం జరగకుండా చూడాలని వారు కోరారు. ఈ విషయమై తాను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.