
ప్రశాంతంగా సాగుతున్న నిమజ్జనం
వికారాబాద్: గణనాథుల ప్రతిష్ఠాపన మొదలుకొని నిమజ్జనం వరకు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు, మండప నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే ఆయా మండల కేంద్రాలు, గ్రామాలు, తాండూరు పట్టణంలో నిమజ్జనాలు ముగిశాయి. జిల్లాలో ప్రధాన ఘట్టం శనివారం కొనసాగనుంది. వికారాబాద్, పరిగి, కొడంగల్‌లో ప్రతిష్ఠించిన విగ్రహాలను శనివారం నిమజ్జనం చేయనున్నారు. ఒక్కో గ్రామంలో ఐదు నుంచి పది వరకు విగ్రహాలను ఏర్పాటు చేయగా.. నియోజకవర్గ కేంద్రాల్లో 40 నుంచి 60 వరకు ప్రతిష్ఠించారు. చంద్ర గ్రహణం నేపథ్యంలో వేద పండితుల సూచనల మేరకు 9వ రోజే నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఏర్పాట్లు పూర్తి
వికారాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను ధారూరు మండలం ఎబ్బనూరు చెరువులో నిమజ్జనం చేస్తారు. పరిగి పట్టణంలోని ప్రతిమలను లఖ్నాపూర్ ప్రాజెక్టులో నిమజ్జనం చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ నారాయణరెడ్డి, ఆయా మండలాల అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పర్యవేక్షిస్తున్నారు. విగ్రహాలు వెళ్లే మార్గాల్లో గుంతలు లేకుండా తాత్కాలిక మరమ్మతులు చేయించారు. ఏయే పట్టణంలో ఏయే మార్గాల్లో ప్రయాణించాలి..? ఏ సమయంలోపు నిమజ్జనం చేయాలి అనే విషయాన్ని పోలీసులు ఉత్సవ కమిటీలకు సూచించారు. దీంతో వారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. వినాయకులను తరలించే వాహనాలను ముస్తాబు చేసి సిద్ధంగా ఉంచారు. విద్యుత్ తీగలు ఉన్న చోట జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
పక్కాగా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు
ఇప్పటికే తాండూరులో పూర్తి
నేడు వికారాబాద్, పరిగి, కొడంగల్‌లో..