
సమాజ నిర్మాతలు
హామీలు అమలు చేస్తున్నాం
● విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది
● స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
● ఉత్తమ టీచర్లకు సన్మానం
ఉపాధ్యాయులు
వికారాబాద్: ‘ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు.. భావితరాల భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది.. గురువులు దైవంతో సమానం.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనది’ అని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో ఉత్తమ టీచర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపికై న 50 మంది టీచర్లను మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, డీఈఓ రేణుకాదేవి ఘణంగా సన్మానించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని బోధన చేయాలన్నారు. టీచర్‌గా వృత్తిని ప్రారంభించి రాష్ట్రపతి వరకు ఎదిగిన సర్వేపల్లి గొప్పతనాన్ని వివరించారు. అంబేడ్కర్, జ్యోతిబాపూలే దంపతులు లాంటి మహనీయులు ఆ రోజుల్లోనే విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఎన్నో అద్భుతాలు చేశారని కొనియాడారు. వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. విద్యాభివృద్ధికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. అమ్మా ఆదర్శ పాఠశాలల పేరుతో బడుల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు. సర్కారు బడులలో నాణ్యమైన విద్య అందుతోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో సమీకృత పాఠశాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
విలువలతో కూడిన విద్యనందించాలి
అనంతరం మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణ బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. విలువలతో కూడిన విద్యను అందించాలని కోరారు.
టీచర్లది గురుతర బాధ్యత
అనంతరం పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులదే గురుతర బాధ్యత అన్నారు. నేడు గొప్ప స్థానాల్లో ఉన్న వారందరూ ప్రభుత్వ బడుల్లో చదివిన వారేనని గుర్తు చేశారు. విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తయారు చేయాలని కోరారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయుల గొప్పతనం తెలిసి ఉండాలన్నారు. వారిని గౌరవించుకోవటం మన బాధ్యత అన్నారు.
అనంతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మండలానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. మరో 78మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్నదానం.. మహాదానం
అన్నదానం మహాదానమని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగంజ్ హనుమాన్ మందిరంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మంజుల, మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.