
ఆ ప్రయత్నాలు మానుకోవాలి
● ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తే ఊరుకోం
● సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య
కొడంగల్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీ ప్రైమరీ విద్య పేరుతో ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను మానుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని కడా కార్యాలయం ముందు కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల్ మండలాలకు చెందిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాధ్యత తీసుకుంటున్నారని, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లోకి వచ్చే విధంగా మార్చిందన్నారు.
ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఈపీ ద్వారా విద్యావలంటీర్లకు ఇచ్చే వేతనాలను అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు అదనంగా అందించాలని కోరారు. ఇంగ్లిష్ మీడియం పేరుతో ఐసీడీఎస్‌ను నిర్వీ ర్యం చేయడం సరైందికాదని హితవు పలికారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభు త్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులను ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో అంగన్‌వాడీ కేంద్రాలు మొత్తం ఖాళీ అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల అంగన్‌వాడీ టీచర్లు సుకన్య, చంద్రకళ, అరుణ, జీవనజ్యోతి, నర్సింగమ్మ, పద్మ, యాదమ్మ, విజయలక్ష్మి, ఆయాలు పాల్గొన్నారు.