
కబ్జాచెరలో జుంటివాగు
బషీరాబాద్: మండలంలోని కాశీంపూర్ శివారులో జుంటివాగు కబ్జాకు గురవుతోందని పలువురు రైతులు ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం.. పదేళ్ల క్రితం నగరానికి చెందిన ఓ కుటుంబం వాగు అంచున 17.13 ఎకరాల వ్యసాయ భూమి కొనుగోలు చేసింది. కొద్ది రోజులుగా వీరు సదరు భూమిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో తమ పొలానికి ఆనుకొని ఉన్న 200 మీటర్ల పొడవునా మట్టిపోశారు. ఈ ప్రాంతం బషీరాబాద్, యాలాల, తాండూరు మూడు మండలాలు కలిసే శివారులో ఉండటంతో అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. చెక్‌డ్యాంకు పక్కనే బఫర్ జోన్ కిందకు వచ్చే పొలంలో గదుల నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం తాండూరు మండలం గోనూరు కాగ్నా నది నుంచి అనుమతులు లేకుండా రాత్రి వేళ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ విషయమై భూ యజమానిని అడగగా తాము పదేళ్ల క్రితం పట్టా భూములను కొనుగోలు చేశామని, ఇందులో కొంత భూమి వాగులో కలిసిందని, దీన్ని సాగులోకి తెచ్చుకునేందుకు చదును చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు.
● పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ●
● ఆందోళనలో పరిసర ప్రాంత రైతులు
కఠిన చర్యలు తీసుకుంటాం
జుంటివాగు శిఖం భూమి కబ్జా చేసినట్లు కొంతమంది రైతులు మా దృష్టికి తెచ్చారు. ఈ భూముల వివరాలు రెవెన్యూ శాఖ వద్ద ఉన్నాయి. వాగు రికార్డులు పరిశీలించి కబ్జా చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నేను సెలవులో ఉన్నా.. రెండు రోజుల్లో చెక్‌డ్యాం, వాగు భూమిని సర్వే చేస్తాం.
– కృష్ణయ్య, డీఈ, తాండూరు