
పుస్తక విజ్ఞానం.. మరింత విస్తృతం
బొంరాస్‌పేట: ‘పుస్తకం హస్త భూషణం’ అన్నారు విద్యావంతులైన పెద్దలు. ప్రచార, ప్రసార మాధ్య మాలు లేని కాలంలో పరిజ్ఞానాన్ని పంచిన పుస్తక ప్రపంచం మరుగున పడబోతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ తిరిగి లైబ్రరీలను బలోపేతం చేయడం, పునఃప్రారంభించడం, ప్రజాపఠనాలయాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను చేపట్టబోతోంది. జిల్లా వ్యాప్తంగా త్వరలో పుస్తక విజ్ఞానాన్ని విస్తృతం చేయబోతోంది.
గ్రామీణ గ్రంథాలయాలివే..
జిల్లా వ్యాప్తంగా పుట్టపహాడ్, మరికల్, నవాబుపేటలో గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటి నిర్వహణ సంపూర్ణంగా జరగడానికి కృషిచేపట్టనున్నారు. పౌర పఠన మందిరాల నిర్వహణకు ప్రతినెలా దిన పత్రికలకు వెయ్యిరూపాయలు, నిర్వాహకుడికి గౌరవవేతనంగా వెయ్యి రూపాయ లు పంచాయతీల ద్వారా అందజేస్తున్నారు.
మంజూరుకు సిద్ధంగా
మండల పరిధిలోని రేగడిమైలారం, కొడంగల్ మండలం రుద్రారంలో విద్యావంతులు ఎక్కువ ఉన్న గ్రామాల్లో త్వరలో పబ్లిక్ రీడింగ్ రూమ్స్ ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ నిర్వాహకులు 37 పోస్టులకుగానూ 10మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు.
నిర్వహణలోని ప్రజా పఠనాలయాలు
దాదాపూర్, పీరంపల్లి, బార్వాడ్, కరన్‌కోట్, నవల్గా, నారాయణ్‌పూర్ గ్రామాల్లోని ప్రజా పఠనాలయాలు నిర్వహణలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను జిల్లా చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి, కార్యదర్శి సురేశ్‌బాబు పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన వాటిని పునఃప్రారంభించేందుకు కృషిచేస్తున్నామని చెబుతున్నారు. నవంబరు 14 నుంచి 20వరకు ఏటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి సాధారణంగా రోజువారీగా 250 మంది పాఠకులు వస్తున్నారు. పరిగిలో 70మంది, తాండూరులో 100, కొడంగల్ 40మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా నిత్యం పెద్ద సంఖ్యలో పాఠకులు గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు.
లైబ్రరీల వివరాలు
త్వరలో మరిన్ని పబ్లిక్ రీడింగ్ రూమ్స్
గ్రంథాలయాల పునఃప్రారంభానికి కసరత్తు
మరో వారంలో ప్రారంభిస్తాం
జిల్లా అక్షరాస్యులకు పఠనాసక్తిని పెంచాలని ప్రత్యేక కృషి చేస్తున్నాం. బసవాపూర్, రుద్రారం, రేగడిమైలారం, చౌడాపూర్, ముజాహిద్‌పూర్‌కు త్వరలోనే పబ్లిక్ రీడింగ్ రూమ్స్ మంజూరు కానున్నాయి. జీపీల పర్యవేక్షణలో కొనసాగే వీటి నిర్వహణకు రూ.2 వేలు ఖర్చు చేస్తారు. స్వయం సహాయక సంఘాల స్వచ్ఛందంగా ఆసక్తి చూపితే రూ.5 వేల వరకు అందించే అవకాశం ఉంది.
– శేరి రాజేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వికారాబాద్

పుస్తక విజ్ఞానం.. మరింత విస్తృతం