వైఎస్సార్‌ అడుగుజాడల్లో కాంగ్రెస్‌ పాలన | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ అడుగుజాడల్లో కాంగ్రెస్‌ పాలన

Jul 9 2025 7:42 AM | Updated on Jul 9 2025 7:42 AM

వైఎస్సార్‌ అడుగుజాడల్లో కాంగ్రెస్‌ పాలన

వైఎస్సార్‌ అడుగుజాడల్లో కాంగ్రెస్‌ పాలన

బంట్వారం: దివంగత సీఎం మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేనివని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఆయన బంట్వారం మండల పరిషత్‌ కార్యాలయంలో రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆశయ సాధనకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ, 108 లాంటి ఎన్నో గొప్ప పథకాలు వైఎస్సార్‌ ప్రవేశపెట్టినవేనని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ అడుగుజాడల్లో పాలన కొనసాగిస్తోందన్నారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం అధికారులకు సూచ నలు ఇచ్చారు. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. వన మహోత్సవంలో భాగంగా మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వెంకటేశం, ఏఎంసీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ రాములు, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

హామీల అమలుకే ‘ప్రజల వద్దకు స్పీకర్‌’

మర్పల్లి: ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేసేందుకు వారంలో రెండు రోజులు ప్రజల వద్దకు స్పీకర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ రాజ్‌ మల్లయ్య అధ్యతన ప్రజల వద్దకు స్పీకర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మర్పల్లి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డిప్యూటేషన్‌పై వెళ్లడంతో అధ్వానంగా మారిందని ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు గత ప్రభుత్వం నిర్మించిన 120 ఇళ్లను అర్హులకు అందజేస్తామన్నారు. గ్రామాల్లో విద్యుత్‌, తాగునీటి తదితర సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.8లక్షల కోట్ల అప్పులు చేసిందని.. రాష్ట్రాదాయంలో సగం డబ్బు వారు చేసిన అప్పలకు కిస్తీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్త శుద్ధితో పని చేస్తున్నారన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ అందజేశారు.

శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

మొక్కలు నాటి సంరక్షించాలి

పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సూచించారు. తల్లిదండ్రులు, పిల్లల పేరున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్క నాటారు. అనంతరం స్త్రీ శక్తి భవనంలో ఏర్పాటు చేసిన మహిళ సంఘాల సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సురేశ్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జగదీశ్వర్‌, డీసీసీ ఉపాధ్యక్షుడు రవీదర్‌, నాయకులు కృష్ణారెడ్డి, రాములు యాదవ్‌, రామేశ్వర్‌, దివాకర్‌, ప్రభాకర్‌, ఖలీమొద్ధీన్‌, శంకరయ్యగౌడ్‌, మండల ప్రత్యేకాధికారి కృష్ణమోహన్‌, తహసీల్దార్‌ పురుషోత్తం, ఏఓ శ్రీకాంత్‌, వెటర్నరీ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం మధూకర్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రిజ్వాన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement