
నాటిన ప్రతి మొక్కా బతకాలి
● వన మహోత్సవాన్ని పకడ్బందీగాఅమలు చేయాలి ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● కలెక్టర్ ప్రతీక్‌జైన్
నవాబుపేట: వన మహోత్సవంలో భాగంగా జిల్లా లో నాటిన ప్రతి మొక్కా బతకాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. బుధవారం మండలంలోని చించల్ పేటలో మొక్కలు నాటారు. అక్నాపూర్, అత్తాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌కు స్వాగతం పలికేందుకు విద్యార్థులను లైన్‌లో నిలబెట్టటాన్ని గమనించిన ఆయన హెచ్‌ఎం పాండు, ఎంఈఓ అబ్దుల్ రెహమాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాయని తెలిపారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరైన వారు పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో 9వేల ఇళ్లు గ్రౌండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాల కారణంగా ఇళ్ల నిర్మాణ పనుల్లో కొంత ఆలస్యం అవుతున్నట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో జిల్లా వ్యాప్తంగా 10వేల దరఖాస్తులు వచ్చాయని, ప్రతి వారం 500 అర్జీలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. భూ సమస్యలు ఉన్న వారు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాఠశాలల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కావడం లేదని, దీంతో పనులు ఆగిపోయాయని ఎమ్మెల్యే యాదయ్య కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన త్వరలో బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. బడి బయట పిల్లలు ఉండరాదన్నారు. అత్తాపూర్‌లో ప్రాథమిక పాఠశాల మూతపడిన విషయం తెలుసుకున్న కలెక్టర్ ఎందుకు పిల్లలను పాఠశాలకు పంపడం లేదని గ్రామస్తులను అడిగారు. పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నారని చెప్పడంతో పాఠశాల భవనాన్ని గ్రంథాలయానికి వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, మండల ప్రత్యేకాధికారి మోహన్‌రెడ్డి, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, మండల నాయకులు నాగిరెడ్డి, ప్రభాకర్, రవీందర్‌రెడ్డి, ఎక్‌బాల్, అనంతరామ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈ సందర్భంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ హలి, సంబంధిత అధికారులు ఉన్నారు.
వసతులు కల్పించండి
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు వంటి సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, కళాశాలల ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలల్లో మరమ్మతులపై దృష్టి సారించాలన్నారు. మౌలిక వసతులు, మరమ్మతులకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డీఐఓ శంకర్ నాయక్ తదితరలు పాల్గొన్నారు.
09 వీకేబీ 101: