
ఓటరు జాబితాలో తప్పులుండొద్దు
● అదనపు కలెక్టర్ సుధీర్ ● బూత్ లెవెల్ ఆఫీసర్లకు శిక్షణ
అనంతగిరి: బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, మార్పులు చేర్పులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. బుధవారం వికారాబాద్ మండలంలోని బీఎల్‌ఓలకు మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫారం 6, 7, 8 నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాలో అవసరమైన చోట పాత ఫొటోలను తొలగించి, నూతన ఫొటోలను అప్‌లోడ్ చేయాలన్నారు. పేర్లలో తప్పులను సవరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేయాలని, కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చూడాలన్నారు. మరణించిన వారి పేర్లను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జిల్లా మాస్టర్ ట్రైనర్, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు.
ఆధార్ నంబరు అనుసంధానం చేయాలి
పరిగి: ఓటరు కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం చేయాలని వికారాబాద్ ఆర్డీఓ వాసుచంద్ర సూచించారు. బుధవారం పరిగి పట్టణంలో బీఎల్‌ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా బీఎల్‌ఓలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎల్‌ఎంటీ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

ఓటరు జాబితాలో తప్పులుండొద్దు