
ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే
● కనీస వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలి ● దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొన్న కార్మికులు
తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంబిస్తున్న తీరుకు నిరసనగా పలు కార్మిక సంఘాలు బుధవారం పట్టణంలో సమ్మె నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో వేర్వేరుగా మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను, 29 కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. వీటి వల్ల కార్మికుల హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల 12గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి వస్తుందన్నారు. సామాజిక భద్రతా పథకాలను తగ్గిస్తూ, ఏకంగా కార్మిక సంఘాలను రద్దు చేయాలనే యోచనలో కేంద్రం ఉందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనం కింద రూ.26 వేలు చెల్లించడంతో పాటు, ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు, పీఎఫ్, బీమా సౌకర్యాలను కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్, కార్యదర్శి రవీందర్, నాయకులు గోపాల్, మునీర్, దస్తప్ప, మీనాజుద్దీన్, దేవి, అబ్దుల్లా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, మల్క య్య, కృష్ణ, బాలమణి, బేబి, భారతి, మల్లమ్మ, సుమలత, శాంత, అరుణ, శ్రీనివాస్, చందు తదితరులు పాల్గొన్నారు.