
కాసుల కోసం కవలల విచ్ఛిన్నం!
ఆరు నెలల గర్భిణికి అబార్షన్
● మగ కవలలను పొట్టన పెట్టుకున్న వైనం
● ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బాధితుల ఆందోళన
● తమకు తెలియకుండా గర్భస్రావం ఎలా చేశారని వైద్యుల నిలదీత
● పరిగి పీఎస్‌లో ఫిర్యాదు
పరిగి: కాసులకు కక్కుర్తి పడి ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు ఆరు నెలల గర్భిణికి అబార్షన్ చేశారు. తమ అనుమతి లేకుండా గర్భస్రావం ఎలా చేస్తా రని సంబంధిత కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఘట న పరిగి మండలంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. కళ్లాపూర్ తండాకు చెందిన హన్మంత్ నాయక్(24)కు గతేడాది చౌడాపూర్ మండలం, కొత్తపల్లి తండాకు చెందిన నందినితో వివాహం జరిగింది.నెల రోజుల క్రితం విద్యుత్‌షాక్‌కు గురైన హన్మంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 5న మృతి చెందాడు. అప్పటికే నందిని ఆరు నెలల గర్భిణి. హన్మంత్ అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజున ఇరు కుటుంబాలకు చెందిన వారు కూర్చుని మాట్లాడుకున్నారు. హన్మంతు ఇంటికి ఒక్కడే కొడుకు కావడంతో అతనికి వారసత్వం ఉండాలని, ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని నందినికి సూచించారు. ప్రసవం తర్వాత తమ ఆస్తులను పిల్లల పేరున చేయడంతో పాటు ఆతర్వాత నందిని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని అత్తింటి వారు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా గత సోమవారం నందిని అత్తవారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్లింది. ఆతర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ బుధవారం పరిగిలోని విజేత ఆస్పత్రిలో ఆమెకు అబార్షన్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న హన్మంతు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని గర్భం నుంచి వెలికి తీసిన ఇద్దరు మృత మగ కవలలను చూసి గుండెలు బాదుకున్నారు. తమ అనుమతి లేకుండా అబార్షన్ ఎలా చేస్తారని వైద్యులను నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను, ఆస్పత్రి సిబ్బందిని స్టేషన్‌కు తరలించారు. హన్మంతు తల్లి మణెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజేత ఆస్పత్రిలో గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. ఇక్కడ అబార్షన్లతో పాటు ప్రసవాల కోసం వచ్చిన వారికి సిజేరియన్లు చేయడం నిత్యకృత్యమని పలువురు ఆరోపించారు. ఈ విషయమై పూర్తి స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆస్పత్రి నిర్వాహకులను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. సమాధానం చెప్పకుండా ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు.