
‘ఆరోగ్య మహిళ’ను వినియోగించుకోవాలి
అనంతగిరి: ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం ఆమె రామయ్యగూడ, సిద్దులూర్ పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య, అందించే సేవలపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, క్యాన్సర్ స్క్రీనింగ్, పోషకాహార లోప సమస్యలు, జననేంద్రియాలకు సంబంధించి సమస్యలు, కుంటుంబ నియంత్రణ, లైంగిక వ్యాధుల నిర్వహణ వంటి సమస్యలకు పరిష్కారం చూపేలా స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు. సాధారణ వ్యాధితో ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అవరసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు, పీహెచ్‌సీలో లేదా టీహబ్‌లో చేయించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఫార్మసీ స్టోర్‌లలో మందులను ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
బంట్వారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ లలితాదేవి అన్నారు. మంగళవారం ఆమె కోట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారానికోసారి నిర్వహించే ఆరోగ్య మహిళా కార్యక్రమంపై ఆమె డాక్టర్ మేఘనను అడిగి తెలుసుకున్నారు. 15 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకు సంబంధించి తప్పనిసరిగా అవసరమైన వైద్య పరీక్షలు చేయాలన్నారు. వీరిలో లోపాలను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సిబ్బందికి సూచించారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మేఘన, సీహెచ్‌ఓ ఖయూం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.