
మంత్రి కొండా సురేఖను కలిసిన నాయకులు
కొడంగల్ రూరల్: రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండాలని ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు చండీ, కుబేర, పాశుపత యాగాలు నిర్వహించనున్నట్లు డీడీఎన్‌ఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, దౌల్తాబాద్ వాసుదేవశర్మ తెలిపారు. బుధవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్‌లో కలిసి యాగాలకు రావాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని సంఘం నాయకులు తెలిపారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.గురునాథ్‌రెడ్డిని కలిసి ఆహ్వానించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు జీ లక్ష్మీనరసయ్య శర్మ, జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారి, జ్యోషి కిట్టు స్వామి, దత్తాత్రేయరావు తదితరులు పాల్గొన్నారు.
రేపు కొబ్బరి కాయల విక్రయానికి వేలం
మోమిన్‌పేట: మండలంలోని ఏన్కతల గ్రామంలో వెలసిన శనైశ్చరస్వామి ఆలయం వద్ద ఏడాది పాటు కొబ్బరి కాయలు విక్రయించడానికి ఈ నెల 11న వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ నరేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వారు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఉదయం 10గంటలకు ఆలయం ప్రాంగణంలో వేలం నిర్వహిస్తామని ఆసక్తి గల వారు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు.
గురుకుల కళాశాల నుంచి విద్యార్థి అదృశ్యం
కుల్కచర్ల పీఎస్‌లో ఫిర్యాదు
కుల్కచర్ల: గిరిజన గు రుకులకళాశాలనుంచి విద్యార్థి అదృశ్యమైన ఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు లు, అధ్యాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బండవెల్కిచర్ల గిరిజన గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎంపీసీ) చదువుతున్న సందీప్(16) మంగళవారం ఉదయం 7:35 నిమిషాలకు పాఠశాల ప్రహరీ దూకి పారిపోయాడు. అటెండెన్స్ సమయంలో విద్యార్థి గైర్హాజరును గమనించిన సిబ్బంది హాస్టల్‌లో వెతికారు. మధ్యాహ్నం వరకూ ఆచూకీ తెలియకపోవడంతో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం 7:35 నిమిషాలకు మరుగుదొడ్ల వద్ద ఉన్న ప్రహరీ వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. కాలేజీ ప్రిన్సిపల్ మధూసూదన్, పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీకాంతరెడ్డి ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. సందీప్ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం రుసుంపల్లితో పాటు బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం ఉదయం కాలేజీ ప్రిన్సిపల్ కుల్కచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంత్రి కొండా సురేఖను కలిసిన నాయకులు