
అధ్వాన రోడ్డు.. అవస్థలు చూడు
తాండూరు రూరల్: గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వర్షానికి రహదారులన్నీ గుంతలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాత్రిపూట గోతులు కనిపించకపోవడంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారులు మాత్రం పనులు ప్రారంభించడం లేదని తాండూరు మండలవాసులు ఆరోపిస్తున్నారు. కనీసం గుంతలను సైతం పూడ్చాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
పెద్ద గుంతలతో ఇబ్బంది
మండలంలోని సంగెంకలాన్ గ్రామం తాండూరు పట్టణానికి 18 కిలో మీటర్లు దూరంలో ఉంది. తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ప్రధానంగా గ్రామస్తులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంగెంకలాన్ నుంచి మల్కాపూర్ మీదుగా ప్రధానరోడ్డు తాండూరు–చించోళి మార్గం ద్వారా నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మల్కాపూర్ గేటు నుంచి సంగెంకలాన్ గ్రామానికి 5 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం ఆ రహదారి పూర్తి గా ధ్వంసమైంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారుతోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వినతిపత్రం అందజేత
సంగెంకలాన్‌కు వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని ఆ గ్రామానికి చెందిన బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాళ్ల సంజీవ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఏఈ శ్రవణ్‌కు వినతిపత్రం అందజేశారు. గుంతలమయమైన రోడ్డుతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
నిధులున్నా ప్రారంభం కాని పనులు
ఇబ్బందులు పడుతున్న సంగెంకలాన్ గ్రామస్తులు
త్వరగా పూర్తి చేయాలని
బీజేపీ నేతల వినతి
త్వరలో పనులు ప్రారంభం
మల్కాపూర్ నుంచి సంగెంకలాన్ గ్రామానికి బీటీ రోడ్డు రెన్యూవల్‌కు ప్రభుత్వం రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఎస్‌ఎస్‌ఆర్ కంపెనీ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. కాంట్రాక్టర్‌ను పిలిచి మాట్లాడాను. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తారు.
– శ్రవణ్, ఏఈ, ఆర్‌అండ్‌బీ శాఖ, తాండూరు

అధ్వాన రోడ్డు.. అవస్థలు చూడు