ప్రచారం కోసం సమాచారశాఖలోకి ఇద్దరు ఉద్యోగులు ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఇన్‌ఫ్లుయన్సర్లకు జీతాలు గోరంత అభివృద్ధిని కొండంతలుగా చూపించడమే పని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే డ్యూటీ గుట్టుచప్పుడు కాకుండా నియామకం నేటి నుంచి బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్ : ప్రభుత్వ డప్పు కొట్టడానికి జిల్లా సమాచారశాఖలో ఇద్దరు ఉద్యోగులను గుట్టుచప్పుడు కాకుండా నియమించారు. సర్కారుకు అనుకూలంగా సోషల్ మీడియా ద్వారా ఎలా ప్రచారం చేయాలి అనే అంశంపై వారికి విజయవాడలో ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఈ మేరకు సోమవారం నుంచి కలెక్టరేట్‌లోని సమాచారశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే సమాచారశాఖ కార్యాలయంలో 18 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే కొత్తగా ప్రైవేటు ఏజెన్సీ పర్యవేక్షణలో పనిచేయడానికి వస్తున్న ఇద్దరు ఉద్యోగులకు ప్రత్యేకంగా రెండు సీట్లు (కుర్చీలు) ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సదరు ఉద్యోగులు ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.వేల జీతాలను తీసుకుని సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టు చేయాల్సి ఉంటుందని డ్యూటీలు కేటాయించారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ.. ఆయా డిపార్ట్‌మెంట్‌ల పరిధిలో చేసిన అభివృద్ధికి చెందిన అంశాలపై ప్రత్యేక వీడియాలు, ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్
సోషల్ మీడియా టీమ్ తమపై పెత్తనం చేస్తుందేమోనని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఫొటోలు, వీడియాలు అంటూ పదేపదే ఇబ్బందులు పెట్టడమే కాకుండా పరిపాలన కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని పలువురు గుబులు పడుతున్నారు. మరోవైపు సమాచారశాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారే అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ రోజు వారీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్ చేసేది ఏముంది అంటూ పలువురు మండిపడుతున్నారు. అలాగే జిల్లా సమాచారశాఖలో 44 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉంది. అయితే కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. 26 మంది ఉద్యోగుల కొరత ఉంది. వాటిని భర్తీ చేయకుండా ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో ఉద్యోగులను తీసుకోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మొదటి దశగా జిల్లాకు ఇద్దరు ఉద్యోగులు వస్తున్నారని...ఆ తర్వాత దశల వారీగా వారి సంఖ్య పెరుగుతుందనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా చంద్రబాబు ఏజెంట్లను తీసుకురావడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వలంటీర్లకు ఇస్తే దుర్వినియోగం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్‌కు రూ. 5 వేల గౌరవ వేతనం ఇచ్చేవారు. వారితో సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇంటికే చేర్చేవారు. అలాగే ప్రజలకు ఉపయోగపడే వివిధ పనులను పూర్తి చేయించేవారు. అయితే అప్పట్లో వలంటీర్లకు ఇచ్చే చిరువేతనమే దుర్వినియోగంగా చంద్రబాబు అండ్ కో పదేపదే విమర్శలు చేసేవారు. అయితే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాలో పోస్టులను పెట్టడానికి జిల్లాకు ఇద్దరు చొప్పున రూ.వేల వేతాలను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా చెల్లించి నియామకాలు చేపట్టడంలో తప్పులేదా చంద్రబావు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.


