శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా కనకాచలంపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శాస్త్రోక్తంగా కలశ ప్రతిష్ట చేపట్టారు. విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఉత్సవాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు అష్టబంధన పూజలు జరిపించారు. అమ్మవారి మూలవిరాట్‌కు పలు రకాల సుగంధ ద్రవ్యాలు చందనం, పసుపు, పంచామృత, నారికేళ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు.


