పది మందితో మొదలైన ప్రస్థానం
350 మంది సభ్యులతో సేవలు విస్తృతం
ఆపన్నులకు సాయం చేస్తుంటారు. అన్నార్తుల కడుపు నింపుతుంటారు. ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తదానంతో ఊపిరిపోస్తుంటారు. నిరుపేద బిడ్డల చదువుకు చేయూతనందిస్తుంటారు. అవసరం ఎక్కడ ఉంటే మేమున్నామంటూ అండగా నిలుస్తుంటారు. సేవే లక్ష్యమనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు. నిరంతరం తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసుకుంటూ మహోన్నతంగా అడుగులు వేస్తున్నారు.
తిరుపతి రూరల్: తిరుపతి నగరంలోని ఆటోనగర్ కేంద్రంగా పది మంది యువకులు 2019లో ‘ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్’ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్కరు రూ.200 చొప్పున సమకూర్చుకుని తిరుచానూరు సమీపంలోని నవజీవన్ చారిటబుల్ ట్రస్టులోని పేద విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేయడంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీరు ఆశయాలకు ఆకర్షితులైన మరికొందరు తోడవడంతో ఆటోనగర్ నుంచి అమెరికా వరకు సుమారు 350 మంది సభ్యులుగా చేరారు.
పేద కుటుంబానికి బాసటగా..
వేదాంతపురం పంచాయతీ విద్యుత్ నగర్‌లో రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగి మంచానికే పరిమితమైన ఓ నిరుపేద కుటుంబానికి బాసటగా నిలబడ్డారు. ఆరు నెలల పాటు వారి బాధ్యతలను స్వీకరించి అదే కుటుంబానికి చెందిన ఓ విద్యార్థిని చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ఆమెకు ప్రైవేటు కళాశాలలో ఉచితంగా సీటు ఇప్పించేందుకు కృషి చేశారు. చదువు పూర్తయ్యే వరకు ఆమెకు అయ్యే ఖర్చులను సభ్యులే భరించారు. ప్రస్తుతం ఆ యువతి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా జీవిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
బాల్యానికి భరోసా.. చదువుకు చేయూత
తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మైనర్ బాలిక చదువు మాన్పించి వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. ఆ విషయం తెలుసుకున్న బృందం సభ్యులు వారితో మాట్లాడి బాలిక చదువు కొనసాగించేలా ప్రోత్సహించారు. అవసరమైన వనరులు, నిత్యావసర సరుకులు అందించారు. ఆర్థిక సమస్యలతో మరికొందరు పేద విద్యార్థుల చదువు ఆగిపోకుండా పాఠశాల, కళాశాల ఫీజులు చెల్లిస్తూ తోడ్పడుతున్నారు. అలాగే దేవళంపేటకు చెందిన ఓ నిరుపేద వలంటీర్ కుమార్తె అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో విషయం తెలుసుకున్న బృందం ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం అందించేందుకు ఆర్థిక సాయం చేసింది.
క్రీడాకారులకు ప్రోత్సాహం
సామాజిక సేవతోపాటు క్రీడల అభివృద్ధికి ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్ సభ్యులు తమవంతు సహకారం అందిస్తున్నారు. 2023లో తిరుపతి జిల్లా హాకీ టోర్నమెంట్ సందర్భంగా మూడు రోజులపాటు క్రీడాకారులకు ఆహారం పంపిణీ చేశారు. టోర్నమెంట్‌కు రూ.60 వేల ప్రైజ్‌మనీ కూడా అందించినట్లు ప్రతినిధులు తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు.
అందరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యం
సేవా కార్యక్రమాలకు మరింత మందిని ఆకర్షించేందుకు వివిధ సందర్భాల్లో ప్రముఖులను ఆహ్వానించి సన్మానిస్తున్నారు. సేవాభావం సమాజంలో విస్తరించి, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచే వారి సంఖ్యను పెంచడమే లక్ష్యమని సభ్యులు చెబుతున్నారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం నుంచి పేద విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించడం వరకు విస్తరించిన ఈ ప్రయాణంలో ఎన్నో కుటుంబాలకు చేయూతనందించారు. పది మందితో మొదలైన ప్రయత్నం 350 మంది సభ్యులతో ముందుకు సాగుతుండగా.. మరింత మంది ఆపన్నులకు అండగా నిలవాలన్న సంకల్పమే తమకు స్ఫూర్తి అని సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు.
సేవామార్గంలో ‘ఫ్రీడమ్ ఫ్రమ్ హంగర్’
లక్ష మందికి పైగా ఆహారం
పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఇప్పటివరకు తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు లక్ష మందికి పైగా ఆహారం అందించినట్లు బృందం సభ్యులు తెలిపారు. ప్రముఖుల పుట్టినరోజులు, వర్ధంతుల సందర్భంగా దాతలను సంప్రదించి వారి తరఫున అన్నదానం నిర్వహిస్తూ వ్యక్తిగత వేడుకలను సేవా కార్యక్రమాలుగా మలుస్తున్నారు.
కరోనా సమయంలోనూ సేవలు
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు బయటకు రావడానికే భయపడిన పరిస్థితుల్లోనూ బృందం సేవలు కొనసాగించింది. లాక్‌డౌన్‌లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో రోడ్ల పక్కన నివసించే నిరాశ్రయులు, యాచకులకు ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం పంపిణీ చేసింది. రక్తం అవసరమైన వారికి దాతలను సమన్వయం చేస్తూ ఇప్పటివరకు 500 మందికి పైగా రక్తం అందించేందుకు సహకరించినట్లు సభ్యులు తెలిపారు. తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రిలోని గర్భిణులకు ప్రతి నెలలో ఒకరోజు ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేయడాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తోంది. మాతృదినోత్సవం, మహిళా దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో సుమారు 600 మందికి సరిపడా పౌష్టికాహారం అందిస్తున్నట్లు సంస్థ సభ్యులు వెల్లడించారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. వరదల సందర్భంగా ఆటోనగర్, బైరాగిపట్టెడ, లింగేశ్వరనగర్, సాయినగర్, అవిలాల, గాంధీపురం ప్రాంతాల్లో అల్పాహారం, పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు.


