తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు అన్నిశాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హజరుకావాలని ఆదేశించారు. అలాగే సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. సమస్య పరిష్కారం కాకుంటే గతంలో ఇచ్చిన అర్జీ రశీదును చూపిస్తే సరిపోతుందని చెప్పారు. అలాగే వినతుల స్టేటస్‌ను తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయాలని సూచించారు. అలాగే ప్రతి సోమవారం మండల, డివిజన్ రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసుల్లో సైతం పీజీఆర్‌ఎస్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా స్పందన తెలియజేయాలని కోరారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 16 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 79,737 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,326 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే శ్రీవారి దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.
నేడు ‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ నిర్వహించనున్నట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు ఆదివారం వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఫోన్ చేసే సమయంలో వినియోగదారులు తప్పనిసరిగి విద్యుత్ సర్వీస్ నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
‘నిమ్మ’ళంగా ధర
– కేజీ రూ.120
సైదాపురం : నిమ్మకాయల ధర రోజు రోజుకూ పెరుగుతోంది. దసరా సందర్భంగా గూడూరు నిమ్మ మార్కెట్ సందడిగా మారింది. ప్రస్తుతం కేజీ నిమ్మ రూ.90 నుంచి రూ.120 పలుకుతుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రధానంగా సైదాపురం మండలంలో అధిక సంఖ్యలో రైతులు నిమ్మ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర పంటల వైపు ఈప్రాంత రైతులు పెద్దగా దృష్టి సారించరు. నిమ్మ ధరలు ఆశాజనకంగా ఉండడంతో హర్హం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా గూడూరు నిమ్మ మార్కెట్‌లో లూజు(50 కేజీల బస్తా) రూ.4,500 నుంచి రూ.6వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు వెల్లడిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుల ఊబి నుంచి బయటపడుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో రాజకీయం
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో నాలుగు మాడ వీధులను విద్యుద్దీపాలతో అలంకరించారు. అయితే దుర్గమ్మ కొండపైకి వెళ్లే మార్గంలోని ఆర్చికి రాజకీయ నేతల ఫ్లెక్సీలు అడ్డుగా ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ ఆర్చికి అమర్చిన విద్యుద్దీపాలు సైతం పూర్తిగా కనిపించకుండా ఫ్లెక్సీలు అడ్డుపడుతున్నాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాడ వీధులు, ఆలయ పరిసరాలు, పాఠశాలల వద్ద రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి ఫ్లెక్సీలను తొలగించాలని కోరుతున్నారు.


