తిరుపతి తుడా : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీని డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆడబిడ్డలపై వివక్ష చూపకుండా వారి అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని సూచించారు. అప్పుడే సమాజంతో పాటు దేశాభివృద్ధి చెందుతుందని వివరించారు. బాల్య వివాహాలను అరికట్టాలని, భ్రూణ హత్యలను నివారించాలని లింగ సమానత్వాన్ని పాటించాలని స్పష్టం చేశారు. లింగ వివక్షను మానండి ,ఆడపిల్లలను రక్షించండి అనే అంశంతో కూడిన లఘు చిత్ర తయారీ పోటీల్లో శ్రీకాళహస్తి ఎస్‌వీఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు మొదటి బహుమతిని, సూళ్లూరుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ద్వితీయ బహుమతిని, నాయుడుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు తృతీయ బహుమతిని సాధించారని వెల్లడించారు. అనంతరం నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.


