తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్) : తొట్టంబేడు మండలం, చిన్న సింగమల వద్ద తెలుగు గంగ కాల్వ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఏపీ 39 డబ్ల్యూ 9697 నంబర్ గల రాజేష్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కర్ణాటక, కోలార్ జిల్లా, కరాడిగానహళ్లి గ్రామానికి చెందిన బస్సు డ్రైవర్ కె.ఎస్.మంజునాథరెడ్డి (49) అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు క్లీనర్ తిమ్మప్ప (38), బెంగళూరుకు చెందిన ప్రయాణికురాలు భాగ్యలక్ష్మి (45) స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాజేష్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చిన్న సింగమల హైవే వద్ద ప్రమాదానికి గురైంది. టూటౌన్ సీఐ నాగరాజు బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి, మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీశారు. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వల్ల డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకుని ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.


