శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద మంగళవారం ఆగమోక్తంగా వరుణ మంత్ర జప పారాయణం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో పాటు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర దేవదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా కలశ స్థాపన చేశారు. మృత్యుంజయ స్వామికి పలు రకాల సుగంధ పరిమళద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. విశేషంగా స్వామివారిని అలంకరించారు. వేదపండితులు వేదపారాయణదారులు వరుణ దేవుని అనుగ్రహం కోసం వరుణ మంత్రాలను భక్తిశ్రద్ధలతో జపించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధిం చారు. ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


