తిరుపతి రూరల్: రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయన్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు 629 ఏఈఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఆరు నెలల్లో లక్ష సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందించాలని ఆదేశించారు.
46 మందికి కారుణ్య నియామక పత్రాలు
ఏపీఎస్పీడీసీఎల్‌లో కారుణ్య నియామకాల కింద 46 మందికి ఉద్యోగ నియామక పత్రాలు మంత్రి అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 215 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
స్విమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స
తిరుపతి తుడా: పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న రోగికి టీటీడీ ప్రాణదాన పథకం కింద స్విమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యులు అత్యంత సంక్లిష్టమైన, అరుదైన డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా, బాలాయపల్లికి చెందిన చెందిన 61 ఏళ్ల పురుష రోగి గత 8 సంవత్సరాలుగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. చేతులు, కాళ్లలో బిగుతు, కదలికల్లో మందగింపు వంటి సమస్యలతో సతమతమవుతున్న రోగికి మందులతో వ్యాధి లక్షణాలు పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాకపోవడంతో స్విమ్స్ న్యూరోసర్జరీ వైద్యులు సమగ్రంగా పరిశీలించి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా వైద్య బృందాన్ని డైరెక్టర్ డాక్టర్ జగదీష్ అభినందించారు.
జనరల్ స్టోర్‌లో చోరీ
తిరుపతి క్రైం: పోస్ట్ ఆఫీస్ సమీపంలోని కేశవ జనరల్ స్టోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం నిర్వాహకుడు కేశవులు సోమవారం రాత్రి ఎప్పటిలాగే షాపును మూసివేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం వచ్చి చూడగా షట్టర్ పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు. దుకాణంలో ఉంచిన రూ.లక్ష నగదుతో పాటు పెద్ద మొత్తంలో సిగరెట్ ప్యాకెట్లు చోరీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఈస్ట్ ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


