ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌నకు ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌నకు ఎంపికలు

Oct 7 2026 12:29 AM | Updated on Oct 7 2026 12:29 AM

తిరుపతి రూరల్‌: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ప్రీ–రిపబ్లిక్‌ డే ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంప్‌ కోసం వలంటీర్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ రామావత్‌ సైదా, రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి ప్రొఫెసర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఎంపికలు జరిగాయి. వలంటీర్ల క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఎన్‌ఎస్‌ఎస్‌ పట్ల నిబద్ధతను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ బ్యూరో ఇన్‌చార్జి కో–ఆర్డినేటర్‌ డా.పి.నీరజ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ షారా సరోజిని, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు డా.యువశ్రీ, డా.సుజాత, యూత్‌ ఆఫీసర్‌ సంజయ్‌ పాల్గొన్నారు.

కన్నీటి వీడ్కోలు

భాకరాపేట: అనారోగ్యంతో మృతి చెందిన ఆర్మీ జవాన్‌ రెడ్డిబాషా (34) అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో పూర్తి చేశారు. చిన్నగొట్టిగల్లు పంచాయతీ పరిధిలోని టి.కుమ్మరపల్లికి చెందిన రెడ్డి బాషా 12 ఏళ్లుగా భారత సైన్యంలో సిపాయిగా విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. అనంతరం ఆర్మీ అధికారులు జవాన్‌ మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆర్మీ, పోలీసు అధికారులు సైనిక నియమాల ప్రకారం అంత్యక్రియలు జరిపి జవాన్‌కు వీడ్కోలు పలికారు. జవాన్‌కు గౌరవ వందనం సమర్పించారు. రెడ్డి బాషా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.

సైన్స్‌ సెంటర్‌లో బయోక్వెస్ట్‌–2026

తిరుపతి ఎడ్యుకేషన్‌ : దసరా సెలవుల నేపథ్యంలో తిరుపతి జూపార్కు రోడ్డులోని రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌లో బయోక్వెస్ట్‌–2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్‌ సెంటర్‌ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కె.శ్రీనివాస నెహ్రూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవశాస్త్రంపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారిలో ఆచరణాత్మక శాసీ్త్రయ నైపుణ్యం కల్పించేందుకు ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ శిక్షణలో ప్రత్యక్ష ప్రయోగాలు, ల్యాబ్‌ వర్క్‌, మైక్రోస్కోపి, పరిశీలన, వృక్ష జీవశాస్త్రం, జీవావరణ శాస్త్రం, డీఎన్‌ఏ, జన్యుశాస్త్రం, సృజనాత్మక బయోసైన్స్‌ ప్రాజెక్టులు ఉంటాయని తెలిపారు. శిక్షణ తరగతులకు రూ.వెయ్యి ఫీజు చెల్లించి 7 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు పాల్గొనవచ్చని, ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలకు 0877–2286202, 79896 94681నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement