తిరుపతి అన్నమయ్యసర్కిల్: ప్రేమ పేరుతో వచించించి, డబ్బులు, నగలు కాజేసి తనపై ఓ కండక్టర్ లైంగికదాడికి పాల్పడ్డాడని చంద్రగిరి మండలం, కొంగరవారిపల్లెకు చెందిన ఓ ప్రయాణికురాలు మంగళవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అమరావతిలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తనకు జరిగిన పరిణామాలను వివరించి న్యాయం చేయాలని కోరారు. బాధితురాలి కథనం.. తాను చంద్రగిరి నుంచి తిరుపతికి ప్రతిరోజూ బస్సులో ప్రయాణించే క్రమంలో ఆర్టీసీ కండక్టర్ వి.సుబ్రహ్మణ్యంతో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం అతను తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేసేవరకు చేరిందని ఆరోపించారు. ప్రేమ పేరుతో తనపై నమ్మకం కలిగించిన అనంతరం వివిధ దశల్లో తన నుంచి రూ.20 లక్షల వరకు నగదును తీసుకున్నాడని పేర్కొన్నారు. బంగారం కూడా కొనిపించుకున్నాడని వివరించారు. తన వద్ద నుంచి తీసుకున్న నగదు, బంగారం తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని వాపోయారు. తనను ప్రేమిస్తున్నానని చెబుతూ తన వెంటపడి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపారు. ఈ పరిణామాలతో తాను తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు చెప్పారు. తన వద్ద ఉన్న ఫోనన్‌పే లావాదేవీల వివరాలు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బంగారం కొనుగోలుకు సంబంధించిన బిల్లులు, ఇతర ఆధారాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలు తన సమస్యను వివరించిన వెంటనే మంత్రి తిరుపతి ఆర్టీసీ ఆర్‌ఎంకు వీడియో కాల్ చేసి సమస్యను వివరించారు. బాధితురాలు చేసిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపించాలని, సంబంధిత కండక్టర్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.


